వినుకొండ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన కారును వదిలి.. వేరే కారులో వినుకొండ బయల్దేరటం.. సోషల్ మీడీయా వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణమైంది. వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను తగ్గించిందంటూ వైసీపీ తొలుత ఆరోపించింది. వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని.. రిపేర్‌లో ఉన్న వాహనం కేటాయించడంతో అది పలుమార్లు ఆగిపోయిందంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ప్రభుత్వం కేటాయించిన వాహనం మొరాయించడంతో వైఎస్ జగన్ వేరొక వాహనంలో వినుకొండకి వెళ్తున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
ఇక వైసీపీ ట్వీట్‌కు టీడీపీ కూడా అదే రేంజులో కౌంటర్ ఇచ్చింది. వైఎస్ జగన్ అంటే ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించింది. వైసీపీ పుట్టుక నుంచి.. వైఎస్ జగన్ తప్పుడు ప్రచారాలను నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేసింది. ఫేక్ పాలిటిక్స్ పేటెంట్ రైట్స్ వైఎస్ జగన్‌వేనన్న టీడీపీ.. వైసీపీ ఉనికి చాటుకునేందుకు వైఎస్ జగన్ మరోసారి దానినే నమ్ముకున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.
"వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్ 5 నిముషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చో లేకపోయారు. ఇదే కారులో చంద్రబాబు నాయుడు 10 ఏళ్లు ప్రయాణం చేశారు. ప్రతిపక్ష నేతగా వందల కిలోమీటర్లు ఇదే కారులో ఆయన గత 5 ఏళ్లు ఉన్నారు. ఎన్‌ఎస్‌జీ భద్రతలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారు. తమరు చేసిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని చాటేందుకు ఏకధాటిగా వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారు. కానీ ఎక్కడా నాకు కంఫర్ట్ లేదు అనలేదు.. నా వాహనాలు మార్చండి అని యాగీ చెయ్యలేదు... ప్రభుత్వం కక్ష కట్టింది అని రాజకీయం చేయలేదు. ఒంగోలు మహానాడుకు వెళ్తుంటే .ప్రభుత్వ కారులో ఏసీ రాక ఆయన ఎమ్మెల్యే కారులో ప్రయాణం చేశారు. నిబంధనలకు విరుద్దంగా బుల్లెట్ ఫ్రూప్ లేని వాహనంలో వెళ్లాల్సి వచ్చినా లెక్క చేయలేదు. గొడవ చేయలేదు. అప్పటికే మూడు సార్లు సిఎంగా చేసిన ఆయన ఆ వయసులో అదే వాహనంలో ప్రయాణం చేశారు. ప్రజల పక్షాన పోరాడారు." అంటూ టీడీపీ ట్వీట్ చేసింది..
నంద్యాలలో అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఇదే సఫారీ కారులో చంద్రబాబును తీసుకువచ్చినట్లు టీడీపీ విమర్శించింది. అయితే అధికారం కోల్పోయిన నెల రోజులకే వైఎస్ జగన్‌కు ప్రభుత్వ కారు నచ్చడం లేదని. సౌకర్యంగా లేదని దిగిపోయారంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. వైఎస్ జగన్‌కు ప్రభుత్వం కేటాయించిన కారులో ఎలాంటి సమస్యా లేదన్న టీడీపీ.. వైఎస్ జగన్ దిగిన తరువాత కూడా ఆ కారు ఆ కాన్వాయ్‌ను ఫాలో అయ్యినట్లు తెలిపింది. వైఎస్ జగన్‌కు కంఫర్ట్ లేకపోతే నచ్చిన కారు కొనుక్కోవాలని.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికింది. ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్‌కు గతంలో మాదిరిగా 946 మందితో భద్రత, పరదాలు, బారీకేడ్లతో కాన్వాయి కావాలంటే జరగని పని అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
మరోవైపు టీడీపీ కౌంటర్‌కు వైసీపీ స్పందించింది. ఫేక్ ప్రచారం గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదంటూ వైసీపీ మరో ట్వీట్ చేసింది. వైఎస్ జగన్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆరేళ్లకు పైబడినదిగా వైసీపీ పేర్కొంది. కారులో ఏసీ పనిచేయకపోతే.. వర్షం పడుతున్నప్పుడు కారు గ్లాసులో నుంచి రోడ్డు ఎలా కనిపిస్తుందని.. డ్రైవర్ ఎలా కారు నడుపుతారంటూ ప్రశ్నించింది. వాహనంలో సమస్య ఉన్నప్పుడు మాజీ సీఎం ఆ కారు దిగి.. తన పార్టీకి చెందిన వేరొక లీడర్ కారులో వెళ్లడం తప్పు ఎలా అవుతుందంటూ వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ లీడర్ కారులో వెళ్తే.. సొంతకారులో వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. భద్రతాపరంగా ముప్పు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇచ్చినా.. స్కేల్ డౌన్ చేసిన మాట వాస్తవం కాదా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
అలాగే 21 ఏళ్ల క్రితం చంద్రబాబు మీద దాడి జరిగితే ఇప్పటికీ ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాటుగా ఎన్ఎస్‌జీ కమాండోలతో భద్రత కల్పిస్తున్న విషయాన్ని వైసీపీ ప్రస్తావించింది. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకోకముందే.. వైఎస్ జగన్ నివాసం, క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాలలో చెక్ పోస్టులను ఎత్తివేశారని ఆరోపించింది.