ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై ఎన్డీఏ కూటమి పథకం హామీపై మాట తప్పిందంటూ విమర్శలు వచ్చాయి.. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు.. తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం.. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందన్నారు లోకేష్. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన.. విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు కొంత సమయం కావాలని అడిగామన్నారు మంత్రి. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. మంత్రులతో చర్చించి ఎలాంటి తప్పులు జరగకూడదని కసరత్తు చేస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం పేరుతో.. గత ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని చెప్పారని.. తొలి ఏడాది రూ.15వేలు ఇచ్చారన్నారు. ఆ ఆ తర్వాత సంవత్సరం రూ.14వేలు, ఆ తర్వాత ఏడాది రూ.13వేలకు తగ్గించారన్నారు. రూ.వెయ్యి టీఎంఎఫ్, మరో వెయ్యి రూపాయలు ఎస్‌ఎంఎఫ్ అని తీసుకున్నారన్నారు.
తల్లికి వందనానికి సంబంధించి గత ప్రభుత్వం మొదటి ఏడాది తర్వాత నిబంధనలు, అర్హతలను మార్చేసిందన్నారు లోకేష్. కరెంట్ బిల్లులకు పథకానికి లింక్ పెట్టారన్నారు.. ఈ నిబంధనలు మార్చడంతో చాలామందికి అమ్మఒడి దక్కలేదన్నారు. అందుకే తాము తల్లికి వందన పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి అందరితో చర్చిస్తామన్నారు.
2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 72వేలమంది విద్యార్థులు తగ్గారన్నారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో రూ.వేలాది కోట్లు ఖర్చు చేసిందని.. అయినా అడ్మిషన్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వ సీబీఎస్‌ఈ తీసుకొచ్చిందని.. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారని.. టోఫెల్ అన్నారని గుర్తు చేశారు. కానీ విద్యారంగంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే బావుంటుందన్నారు. విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నామో ముందే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి.. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామన్నారు నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతున్నాయని.. 11వేల పాఠశాలల్లో 10కంటే తక్కువమంది విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఎలా అడ్మిషన్లు ఎలా పెంచాలి.. నాణ్యత ఎలా పెంచాలనే అంశాలపై చర్చిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా పరిశీలిస్తున్నామని.. అధికారులు, తాను వెళ్లి పరిశీలిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో మోడల్స్ పరిశీలించిన తర్వాత.. ఏపీకి ఏ మోడల్ బావుటుందో దాన్ని తీసుకుంటామని.. విద్యా రంగంలో అవసరమైన మార్పులు చేస్తామన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకునే నిర్ణయాలను తల్లిదండ్రుల ముందు ఉంచి వాళ్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు.