ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చింది. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకూ కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు్ ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణలోనూ గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. అయితే రూ.500లకు గ్యాస్ సిలిండర్లను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది.