అతడో పండ్ల వ్యాపారి. కానీ దొంగగా మారాడు. బైకులను దొంగిలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదట్లో సంపాదన సరిపోకపోవడం వల్ల.. జల్సాలు చేయడానికి దొంగతనాలు మొదలుపెట్టిన అతడు.. జైలుకెళ్లి వచ్చిన తర్వాత తన స్నేహితుడి భార్య కోసం బైకులు దొంగిలించడం మొదలుపెట్టాడు. తన మిత్రుడి భార్య రొమ్ము కేన్సర్ బారిన పడటంతో.. ఆమెకు చికిత్స కోసం డబ్బు భారీగా ఖర్చు అవుతుండటంతో.. తన మిత్రుడికి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఆ పండ్ల వ్యాపారి దొంగగా మారాడు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అశోక్ అలియాస్ ఆపిల్ (33) బెంగళూరులోని సోలదేవనహళ్లిలో నివాసం ఉంటూ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఆ తర్వాత దొంగతనాలు, నేరాల బాట పట్టాడు. దీంతో ఏడాదిన్నర క్రితం భార్య అతణ్ని వదిలేసి వెళ్లింది. ఇక అప్పటి నుంచి తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే నేర ప్రవృత్తిని వదులుకోలేకపోయిన అశోక్.. జైలుకెళ్లి నెల క్రితమే బయటకొచ్చాడు.
ఈలోగా తన స్నేహితుడి భార్య బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిందని తెలిసింది. తనకు అన్నం పెట్టిన స్నేహితుడి భార్య ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుండటం అశోక్‌ను కలచి వేసింది. తన స్నేహితుడి భార్య చికిత్సకు డబ్బు అవసరం కావడంతో.. అశోక్ మళ్లీ దొంగతనాల బాట పట్టాడు. బెంగళూరులోని బ్యాదరహల్లి ప్రాంతానికి చెందిన సతీష్ అలియాస్ సత్య (40)తో కలిసి బజాజ్ పల్సర్ బైకులు, కేటీఎం బైకులను కొట్టేయడం మొదలుపెట్టాడు. ఇలా దొంగతనం చేసిన బైకులను అమ్మేయగా వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని స్నేహితుడి భార్య చికిత్స కోసమే ఖర్చు చేశాడు.
గిరినగర్ సెకండ్ ఫేజ్‌లో నివాసం ఉండే నిఖిల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తన పల్సర్ బైకు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. అశోక్, సతీష్ ఆ బైకును దొంగిలిచినట్లు తేలింది. అప్పటికే పాత నేరస్థులు కావడంతో.. పోలీసులు మరింత లోతుగా విచారించగా.. తాము రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి పల్సర్, కేటీఎం బైకులను దొంగిలిస్తున్నామని అంగీకరించారు. బ్యాదరహళ్లి సమీపంలోని ఖాళీ స్థలంలో దాచి ఉంచిన 8 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అశోక్‌పై 15 కేసులు ఉండగా.. సతీశ్‌పై హత్య, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు సహా 42 కేసులు ఉన్నాయి. గతంలో పండ్ల వ్యాపారం చేసేవాడు కాబట్టి అశోక్‌కు ఆపిల్ అనే పేరు కూడా ఉంది. ఆపిల్‌ది మంచి మనసే కానీ.. ఎంచుకున్న దారి మాత్రం బాగోలేదు కదూ..!