ప్రాణాంతక మెదడు తినేసే అమీబియా వ్యాధి ‘మెనింజోఎన్‌సెఫలైటిస్’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాజాగా కోలుకున్నాడు. 97 శాతం మరణాల రేటు కలిగిన ఈ వ్యాధి నుంచి కోలుకోవడం ఓ అద్భుతమే. మెదడు తినేసే అమీడియా సోకిన బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ‘మెనింగో ఎన్‌సెఫలైటిస్’ బారినపడిన బాధితుల్లో ఇప్పటి వరకూ కేవలం 11 మంది మాత్రమే కోలుకున్నారని ఆమె కోజికోడ్ జిల్లాలోని తిక్కోడికి చెందిన 14 ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడ్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా.. అక్కడ సిబ్బంది అమీబిక్ మెనింజోఎన్‌సెఫలైటిస్‌గా అనుమానించి, అధికారులను అప్రమత్తం చేశారు. మూర్చ వ్యాధి లక్షణాలున్న ఆ బాలుడ్ని పయ్యోలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడ నుంచి జులై 1న కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. తక్షణమే అమీబియా ఇన్‌ఫెక్షన్లకు వాడే మిల్టేఫోసైన్ ఔషధాలను ప్రభుత్వం సమకూర్చింది.
వైద్యులు ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న బాలుడు పరిస్థితి మెరుగుపడింది. మొత్తం 22 రోజుల పాటు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోగా.. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. గత రెండు నెలలుగా కేరళలో ముగ్గురు చిన్నారుల ప్రాణాలను ఈ వ్యాధి బలితీసుకుంది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్ అనేది నీటి ద్వారా వ్యాపించే అత్యంత అరుదైన ప్రాణాంతక వ్యాధి. నెగ్లియో ఫౌలేరి అనే అమీబా ఉన్న నీటిలో స్నానం చేయడం, ఈతకు దిగినప్పుడు ముక్కులో నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి 26 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకుుతుంది. బాధితుల్లో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి బ్యాక్టీరియల్ మెనింజైటిస్‌ను పోలిన లక్షణాలు ఉంటాయి. క్రమంగా ఇవి అభివృద్ధి చెంది.. మెదడు కణాలను అమీబియా నాశనం చేస్తుంది. దీంతో మూర్ఛ, గందరగోళం, కోమాలోకి శెల్లి చివరకు మరణం సంభవిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ ఈ వ్యాధిని ప్రారంభంలో గుర్తించలేరు.