‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ విధానం కింద ఈ దేశాల అభివృద్ధి సాయంగా నిధులను భారత్ అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజా బడ్జెట్‌లో మాల్దీవులకు కేంద్రం షాకిచ్చింది. కానీ, భూటాన్‌కు అత్యధికంగా రూ.2వేల కోట్లను కేటాయించింది. మాల్దీవులకు గతేడాది రూ.770కోట్లను కేటాయించగా.. ఈ ఏడాది దానిని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖకు రూ.22,154 కోట్లను కేంద్రం కేటాయించింది. గతేడాదితో (రూ.29,121) పోల్చితే ఈ శాఖకు కేటాయింపులు తగ్గాయి.
లోక్‌సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ దాదాపు ఇవే కేటాయింపులు చేసింది. అయితే, అప్పుడు మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. కానీ, ప్రస్తుత పూర్తి బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని తగ్గిస్తూ రూ.400 కోట్లకు పరిమితం చేయడం గమనార్హం. ఇక, మిగతా దేశాల విషయానికి వస్తే అత్యధికంగా భూటాన్‌కు రూ.2,068 కోట్లు, తర్వాత నేపాల్‌కు రూ.700 కోట్లు, మారిషస్‌కు రూ370 కోట్లు, శ్రీలంకకు రూ.245 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోల్చితే శ్రీలంకకు నాలుగు రెట్లు నిధులు పెంచడం చెప్పుకోదగ్గ అంశం. గతేడాది బడ్జెట్‌లో కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఆ దేశానికి ఇచ్చింది.
ఇరాన్‌తో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం.. అక్కడ చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది. అలాగే, అఫ్గనిస్థాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు కేటాయించింది. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి రూ.200 కోట్లు, లాటిన్ అమెరికా, యురేషియా వంటి పలు దేశాలకు మొత్తం రూ.4,883 కోట్లు నిధుల ప్రతిపాదించింది. వీటితో పాటు అదనంగా విదేశీ ప్రభుత్వాల అడ్వాన్సుల పేరుతో మరో రూ.989 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచింది.
ఇక, చైనా అనుకూలుడుగా పేరొందిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు.. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో వచ్చారు. అప్పటి నుంచి భారత్ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనివిధంగా క్షీణించాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయి.. మాల్దీవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముయిజ్జు ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.