నీట్ యూజీ పరీక్షను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ లాయర్ వైఖరిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు అవకాశం కల్పిస్తామని చెప్పినా... తన వాదనలు వినాలని మాథ్యూస్ జె.నెడుంపార పదేపదే కోరడంతో సీజే సహనం కోల్పోయారు. దీంతో ఆయనపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ చంద్రచూడ్.. కోర్టును నడిపే విధానంపై తమను న్యాయవాదులెవరూ ఆదేశించలేరని వ్యాఖ్యానించారు.
మొదట పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ నరేందర్ హుడా తన వాదనలు కొనసాగిస్తుండగా... మాథ్యూస్ అడ్డుతగిలారు. దాంతో సీజే జోక్యం చేసుకుంటూ.. ‘దయచేసి మీరు కూర్చోండి. ఇలాగే అడ్డుతగిలితే కోర్టు నుంచి బయటకు పంపాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా... దయచేసి సెక్యూరిటీని పిలవండి.. మేము ఆయనను కోర్టు నుంచి తీసుకెళ్లాలని చెబుతాం.. మీరు గ్యాలరీతో మాట్లాడటం లేదు.. మీరు నా మాట వినండి.. కోర్టు ఇంఛార్జిగా దీనికి నేను బాధ్యత వహిస్తాను’ కోపంగా అన్నారు.
దీనికి లాయర్ మాథ్యూస్.. ‘గౌరవనీయులైన న్యాయమూర్తులు నన్ను గౌరవించకుంటే, నేనే వెళ్లిపోతాను’ అంటూనే తన వాదనలు వినడం లేదని ఆయన పదేపదే ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో సీజేఐ అగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను కోర్టు ఇన్‌ఛార్జిని.. నేను చెప్పేది మీరు వినాల్సిందే.. నేను 24 ఏళ్లుగా న్యాయస్థానంలో ఉంటున్నా.. కోర్టును ఎలా నడపాలో నాకు మీరు సలహా ఇవ్వొద్దు. నరేందర్ హుడా వాదనల తర్వాత మీ వాదనలు వింటాం’ అని అన్నారు. అయితే, తాను కూడా సీనియర్ లాయర్‌ను.. 1979 నుంచి కోర్టును చూస్తున్నానని, తాను వెళ్లిపోతున్నట్లు చెబుతూనే సీజేఐ తనకు అన్యాయం చేస్తున్నారని మాథ్యూస్ పేర్కొన్నారు.
ఎన్టీఏ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ... లాయర్ మాథ్యూస్ తీరును ‘ధిక్కార చర్య’గా అభివర్ణించారు. కొద్దిసేపటికి కోర్టు హాలులోకి వచ్చిన మాథ్యూస్ తనను క్షమించాలని, నేను ఎలాంటి తప్పు చేయలేదని వేడుకున్నారు. అతేకాదు తనపట్ల అన్యాయంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. అనంతరం అతడికి అవకాశం రావడంతో... ‘‘నాకు జరిగిన అవమానానికి గౌరవనీయులైన కోర్టు వారిని క్షమిస్తున్నా.. నా వాదనల నుంచి విరమిస్తున్నా’’ అని ముగించారు. ఇక, నీట్-యూజీ 2024 పరీక్షా పత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.