కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. శనివారం జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి శుక్రవారం ఒక అధికార ప్రకటన వెలువడింది.
ఇక ఈ నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాను కూడా కేంద్రం వెల్లడించింది. ''వికసిత్ భారత్@2047'' అనే థీమ్‌తో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం దృష్టి సారించనుంది. వికసిత్ భారత్ @2047 విజన్ డాక్యుమెంట్ కోసం అప్రోచ్ పేపర్‌పై ఈ సమావేశం చర్చిస్తుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహాకారాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు.
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే నిర్దేశించుకుంది. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార బంధం ఉండేలా నీతి ఆయోగ్ 9 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి.. ఈ వికసిత్ భారత్ @ 2047 విజన్ సాకారానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 27 నుంచి 29 వ తేదీల మధ్య జరిగిన 3 వ చీఫ్ సెక్రటరీల జాతీయ సదస్సులో చేసిన సిఫారసులపైనా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. అప్పటి సదస్సులో చర్చకు వచ్చిన సైబర్ సెక్యూరిటీ, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ అండ్ బ్లాంక్స్ ప్రోగ్రామ్, రోల్ ఆఫ్ స్టేట్, ఏఐ ఇన్ గవర్నెన్స్ అంశాలపైనా ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.
ఇక కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్డీఏ మిత్రపక్షాలకే నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇచ్చిందని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే విపక్ష పాలిత రాష్ట్రాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపిన వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకామని తెలిపారు.