భారీ వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది. శనివారం ఉదయం నుంచి గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 53 అడుగులకు చేరటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ప్రవాహం పెరగటంతో కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అటు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో 13 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. అలాగే కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది.
మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరదనీరు ముంచేసింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాజీవ్ బీచ్ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖ వాటర్ స్పోర్ట్స్ నీట మునిగింది.
మరోవైప గోదావరి వరదల కారణంగా ముంపులో చిక్కుకున్న గ్రామాలను మంత్రుల బృందం సందర్శించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరులశాఖ మంత్రి రామానాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి పోలవరం విలీన మండలాల్లో పర్యటించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించిన మంత్రుల బృందం.. నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని పరిశీలించింది. అలాగే అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కన్నాయిగుట్ట వద్దకు చేరుకుని గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం.. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గిన తర్వాత ప్రతి కుటుంబానికి మూడు వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.