కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన 22 ఏళ్ల ఓ యువతి 4 ఏళ్ల కిందట తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరింది. మొదట్లో యూనివర్సిటీ హాస్టల్ ఉండి చదువుకునేది. ఆ సమయంలో ఆమెకు సదాశివం ప్రణవకృష్ణ (35) అనే వివాహితతో స్నేహం ఏర్పడింది. తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో ప్రణవకృష్ణ తన భర్త కృష్ణకిషోర్ రెడ్డితో నివాసం ఉండేది. యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న ఆమెను ప్రణవకృష్ణ తన ఇంటికి ఆహ్వానించింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లివచ్చేది. ఈ క్రమంలో మహిళ భర్త కృష్ణకిషోర్ రెడ్డితోనూ పరిచయం ఏర్పడింది. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన కిషోర్ రెడ్డి ఎస్వీయూ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
తమ ఇంటికి వచ్చే యువతికి క్రమంగా గంజాయి అలవాటు చేసింది ప్రణవకృష్ణ. అలా ఒక రోజు యువతి మైకంలో ఉన్నప్పుడు తన భర్త కృష్ణకిషోర్ రెడ్డి చేత ఆమెపై అత్యాచారం చేయించింది. ఆ దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించింది. తర్వాత ఆ వీడియోను ఆమెకు చూపించి బెదిరించింది. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. బాధితు యువతి ఆ దంపతుల వేధింపులకు తాలలేక ఇప్పటికే పలుమార్లు డబ్బు, నగలు సమర్పించుకుంది. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు.
కొన్ని రోజుల కిందట ఆ యువతికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఆ విషయం తెలుసుకొని ప్రణవకృష్ణ మరింత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది. యువతి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ ఫొటోలు, వీడియోలను ఆమె యువతి సోదరుడికి, ఆమెకు కాబోయే భర్తకు పంపింది. అవి చూసి యువతి కుటుంబసభ్యులు హతాశులయ్యారు. జూలై 25న తిరుపతి పోలీసులను ఆశ్రయించారు.
మరో యువతిని ఇలాగే మోసం
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి గ్రామీణ పోలీసులు శుక్రవారం (జూలై 26) దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను వారు చదువుతున్న యూనివర్సిటీలు సస్పెండ్ చేశాయి. ఈ దంపతులు గతంలోనూ ఓ యువతిని ఇలాగే మోసం చేసి, ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.