రాజమండ్రిలో సంచలనం రేపిన ఏటీఎం డబ్బుల చోరీ ఘటన జరిగిన 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. వాసంశెట్టి అశోక్ కుమార్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం రాజమండ్రిలో ఏటీఎం సెంటర్లలో నగదు నింపే ఏజెన్సీలో పనికి కుదిరాడు. అయితే వ్యసనాలకు అలవాటు పడిన అశోక్ కుమార్ కన్ను.. ఏటీఎంలలో ఉంచే నగదు మీద పడింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 11 ఏటీఎంలలో నగదు నింపాలని ఏజెన్సీ అధికారులు పని అప్పజెప్పారు. అలాగే రూ.2,20,50,000 చెక్కును అశోక్ చేతికి ఇచ్చారు.
ఈ చెక్కును తీసుకున్న అశోక్ కుమార్ దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు అంతటినీ ఓ పెట్టెలో ఉంచి, బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లుగప్పి సొంతకారులో పరారయ్యాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తం కావటంతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసిన పోలీసులు.. నిందితుడు వాసంశెట్టి అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు వ్యసనాలకు అలవాటు పడిన నిందితుడు.. ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కార్లు, బైక్‌లలో తిరుగుతూ స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకోవటం కోసం అడ్డదారులు తొక్కినట్లు తెలిపారు. ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసుకుని చోరీకి స్కెచ్ వేసినట్లు పోలీసులు చెప్పారు. సాంకేతిక ఆధారాలు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. మండపేట సమీపంలో శుక్రవారం రాత్రి అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. రూ.2.20 కోట్లతో ఉడాయించిన అశోక్ కుమార్.. ఈ నగదును తన ఫ్లాట్‌లోనే ఉంచి పరారైరనట్లు పోలీసులు తెలిపారు.
నగదులో 9.50 లక్షలు తీసుకుని ఫ్లాట్ నుంచి వచ్చిన అశోక్.. అందులో 50 వేలు కార్ డ్రైవర్‌కు ఇచ్చినట్లు పోలీసులు వివరించారు. మిగతా 9 లక్షలు వేరేచోట ఇచ్చాడని.. అయితే మిగతా నగదు మొత్తం ఫ్లాట్ లోనే ఉండటంతో.. ఆ చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చివరకు మండపేట సమీపంలో అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నగదు అపహరణలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ సంస్థ, బ్యాంక్ సమక్షంలో నగదు అప్పగిస్తామని వివరించారు.