తన కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే పనిలో పడ్డారు. అధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి తన కార్యాలయానికి వచ్చిన అర్జీలను పరిశీలించారు. శనివారం ఉదయం నుంచి కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతూ వాటికి పరిష్కార మార్గాలు వెతికే పనిలో ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు సమస్యలు, ఇబ్బందులను ఏకరవు పెడుతూ ప్రజల నుంచి అనేక వినతులు వచ్చాయి.
వీటి అన్నింటినీ ఓపికగా చదువుతూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు, సమస్య తీవ్రతను అనుసరించి తానే స్వయంగా అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ సమస్య పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డులో కొందరు యువకులు బైక్స్ మీద ప్రమాదకరంగా సంచరిస్తూ విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్నారు. వృద్ధులను భయపెడుతున్నారు. ఈ విషయాన్ని అక్కడి మహిళలు, వృద్ధులు పవన్ కళ్యాణ్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని లేఖలో ఫిర్యాదుచేశారు. అలాగే మద్యం తాగి ఇళ్ల ముందు గొడవ చేస్తున్నారని వాపోయారు.
ఈ లేఖతో పాటుగా యువకుల వివరాలు, బైక్ మీద తిరుగుతున్న ఫోటోలను, నంబర్ ప్లేట్ల వివరాలను సైతం పవన్ కళ్యాణ్‌కు పంపించారు. హెచ్చరిస్తే బెదిరింపులకు దిగుతున్నారని.. మహిళా ఎస్సైను సైతం వేధించారని పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు వెంకటగిరి వాసుల ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని.. ఆడపిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీసులు కూడా దీనిపై దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు.