టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరికి అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఆయనను.. సీఎం చంద్రబాబు చొరవతో డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి పంపించారు.2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన వెంకయ్య చౌదరి.. జులై 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఆ వెంటనే ఆయనను టీటీడీ అదనపు ఈవోగా ప్రభుత్వం అదే రోజు నియమించింది. అయితే శనివారం ఆయన టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందిస్తామని చెప్పారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని చెప్పారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలోని క్యూలైన్లను టీటీడీ అదనపు ఈవో పరిశీలించారు.
నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లను వెంకయ్య చౌదరి పరిశీలించారు.నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూలైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రధమ చికిత్స కేంద్రాలను కూడా టీటీడీ అదనపు ఈవో తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో ఉన్న స్కానింగ్ సెంటర్‌ను పరిశీలించిన వెంకయ్య చౌదరి.. భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, మంచినీరు, పాలు వంటి వాటిని పరిశీలించారు. పారిశుద్ధ్యంపైనా ఆరా తీశారు. కంపార్టుమెంట్లు మరింత శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1, నంబి ఆలయం, పరిసరాలను పరిశీలించిన వెంకయ్య చౌదరి.. క్యూలైన్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.