కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పశ్చిమ బంగాల్‌కు విమానాశ్రయాల గురించి టీఎంసీలు ఎంపీ ప్రశ్నను లేవనెత్తారు. దీనికి పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. అనంతరం మాట్లాడిన సుదీప్ బంధోపాధ్యాయ్.. తన మిత్రుడి కుమారుడు కేంద్ర మంత్రి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన బెస్ట్ ఫ్రెండ్‌లలో ఒకరైన కింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు ఇంత చిన్న వయసులో కేంద్ర మంత్రి కావటం తనకెంతో సంతోషాన్ని ఇస్తోందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
12, 13వ లోక్ సభ సమయంలో ఎంపీగా ఉన్న ఎర్రన్నాయుడు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఆయన కొడుకు ఇప్పుడు మంత్రి కావటం చాలా ఆనందంగా ఉందని సుదీప్ బందోపాధ్యాయ్ చెప్పుకొచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అలాగే కోల్‌కతాలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీనియర్ సభ్యుడైన సుదీప్ బందోపాధ్యాయ్ ఆశీర్వాదం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విమానాశ్రయం అవసరం ఉండి.. బెంగాల్ ప్రభుత్వం సహకరిస్తే మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
కింజరాపు ఎర్రన్నాయుడు విషయానికి వస్తే టీడీపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రన్నాయుడు.. చనిపోయే వరకూ టీడీపీలోనే కొనసాగారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఓ సారి కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. ఈ సమయంలోనే జాతీయ పార్టీలతో, జాతీయ పార్టీ నేతలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే 2012లో ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడటంతో.. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగం మానేసి.. 26 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. శ్రీకాకుళం ఎంపీగా 2014,19,24 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. చిన్నవయసులోనే కేంద్ర మంత్రి పదవి అలంకరించారు.