ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్రం ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. ఈ సంఖ్యను మరో 30 పెంచింది. ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ 174కు పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్ జిల్లా సంఖ్యను పెంచారు. దీంతో పెరిగిన జిల్లాలకు నూతన ఎస్పీలు, క్రైమ్, నిఘా విభాగాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అవసరమైన సంఖ్యలో ఏపీలో ఐపీఎస్ అధికారులు లేకుండా పోయారు.
ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఏపీలో ఐపీఎస్ అధికారుల కొరతను గుర్తించిన చంద్రబాబు.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు.. ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు. ఐపీఎస్ అధికారుల కొరత కారణంగా జూనియర్ ఐపీఎస్ అధికారులనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తోందని అమిత్ షాకు వివరించారు. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని అమిత్ షాను కోరారు.
చంద్రబాబు అభ్యర్థనకు స్పందించిన హోం మంత్రి అమిత్ షా.. ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‍ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదనంగా మరో 30 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను, రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్‌గా 23 మందిని కేటాయించారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏపీకి కొత్త ఐపీఎస్ అధికారులు రానున్నారు. ఫలితంగా ఏపీలో ఐపీఎస్ అధికారుల కొరత కాస్త తగ్గనుంది.