ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో కొన్ని ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే కరెంట్ నిలిచిపోయిన గ్రామాల్లో మరమ్మత్తులు చేపట్టేందుకు సిబ్బంది పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా అదే జరిగింది. ఓ గ్రామంలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు సిబ్బంది పెద్ద సాహసం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ పునరుద్ధరించేందుకు..ఈపీడీసీఎల్ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సున్నంపాడుకు వెళ్లే విద్యుత్‌లైన్‌పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అయితే సున్నంపాడు సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. లైన్‌మెన్ సిబ్బంది తాడుపై నడుచుకుంటూ వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
ఇలా తాడుపై నడుచుకుంటూ వెళుతున్న విద్యుత్ సిబ్బంది సాహసాన్ని కొందరు మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. ఆ తాడు జారి కిందపడితే వాగులో కొట్టుకుపోతారు.. కానీ ఎలాంటి భయం లేకుండా అక్కడి సిబ్బంది ఈ సాహసం చేశారు. విధి నిర్వహణకు ఓ విధంగా ప్రాణాలు పణంగా పెట్టారనే చెప్పాలి.. వీరి సాహసంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఈ ఊరికి వెళ్లేడానికి వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ పనులు ప్రారంభించలేదని స్థానికులు అంటున్నారు. వరదల సమయంలో ఇదొక్కటే మార్గమని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కాలువ దాటాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే రంపచోడవరం మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలచిపోయి స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి విషయం తెలియడంతో స్పందించి ఆమె స్వచ్ఛందంగా పొక్లెయిన్ ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదలతో ఇప్పటికి కొన్ని గ్రామాలు వరదలో ఉన్నాయి.