తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మోహిత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్నేహితుడి వివాహానికి బెంగళూరు నుంచి దుబాయ్‌కు వెళుతుండగా.. పోలీసులు అరెస్టు చేశారని.. కేసు పెట్టినప్పటి నుంచి గత వారం రోజులుగా తుమ్మలగుంటలోనే ఉన్నా అరెస్ట్ చేయలేదని అన్నారు. విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడినని, తన కన్న మించి మోహిత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని అన్నారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.