గతంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా రహదారుల అనుసంధానం చేసి ఫలితాలు సాధించామని, ఇప్పుడు నదుల అనుసంధానం దేశానికి చారిత్రక అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో రోడ్‌మ్యా్‌పను రూపొందించాలని సూచించారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం ఫలితాలను ఏపీ అనుభవిస్తోందని చంద్రబాబు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా వైద్య సదుపాయాలు అందించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అధిక జనాభా దేశ బలహీనత కాదని, బలమని తెలిపారు. యువత మన దేశానికున్న అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. యువతను సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించడం ఏమంత కష్టం కాదని, మన దేశ సంపదను సక్రమంగా వినియోగించుకుంటే 50 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించడం ఆసాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతిఆయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమావేశంలో దాదాపు పది అంశాలు ప్రస్తావించానని, ఏపీలో ఉన్న అవకాశాలను వివరించానని చెప్పారు. పోలవరం, అమరావతికి తోడ్పాటు అందిస్తునందుకు, విభజన హమీలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.