వైద్యం వికటించి ఓ రైతుకూలీ మృతి చెందిన సంఘటన వినుకొండలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు సమాచారం మేరకు వివరాలు.. నూజండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను (30) గొర్రెలు కాసుకునేవాడు. ఈ క్రమంలో కాలి బొటన వేలుకు గాయం కాగా బుర్రిపాలెం సమీపంలోని రవ్వారంలోని ఆర్‌ఎంపీ సిహెచ్.మల్లికార్జునరెడ్డి వద్దకు చికిత్సకు వెళ్లాడు. గాయానికి వైద్యం చేసి, అనంతరం నొప్పికి ఇంజక్షను చేశాడు. కొద్ది సేపటికి శ్రీనుకు ఒళ్ళంతా మంటలు రావడంతో పాటు, ఒంటిపై బొబ్బలు వచ్చి, ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆర్‌ఎంపీ వెంటనే శ్రీనును ఆటోలో వినుకొండ వైద్యశాలకు తరలించాడు. అప్పటికే శ్రీను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, శ్రీను బంధువులు పెద్ద సంఖ్యలో వినుకొండ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. శ్రీనుకి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని శ్రీను కుటుంబ సభ్యులు నూజండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.