కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పూజలు చేస్తామని నమ్మించి ఓ వృద్ధురాలిని, ఆమె కోడల్ని దొంగ పూజారులు మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక నాగప్పవీధికి చెందిన పద్మాబాయి అనే వృద్ధురాలు తన కోడలుతో కలిసి ఉంటుంది. కొడుకు రైల్వేలో చిరు ఉద్యోగి. శుక్రవారం వీరింటికి భిక్షాటనకు ఓ ఇద్దరు పూజారులు వచ్చారు. మొదట బియ్యం వేయాలని కోరడంతో ఆమె బియ్యం వేసింది. ఆ తర్వాత మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ కొంచెం భయాన్ని సృష్టించారు. మీ కొడుకుకు ప్రాణగండం ఉందంటూ మరో అడుగు ముందుకేసి ఆమెలో మరికొంత భయాన్ని ఉసి గొల్పారు. మీ కొడుకుకు ప్రాణగండం తప్పాలంటే కొన్ని పూజలు చేయాలన్నారు. పెద్దగా ఖర్చు కాదని, మీరే నదికి వెళ్లి స్వయంగా పూజలు చేయాలన్నారు. మీతో పాటు 11 మంది పిల్లలను తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. వేరే పిల్లలను ఎవరూ కూడా పంపరు కదా అని ప్రశ్నిస్తే.. ఆ పని కూడా మేమే చేస్తామంటూ నమ్మించారు. చేసేదేమీ లేక ప్రాణభయంతో వృద్ధురాలు తన ఇంట్లో ఉన్న రూ.30వేలు వారి చేతికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ పూజారులు మరి కొన్ని భయాలు సృష్టించి రూ.20వేలు లాక్కున్నారు. దీంతో ఆ వృద్ధురాలు శనివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీ సు లు శనివారం రాత్రి సంఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తే వీరితో పాటు ఆ ఏరియాలో మరి కొంత మందిని కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓ ఇంట్లో రూ.3వేలు, మరో ఇంట్లో బియ్యం.. ఇలా వచ్చిన కాడికి దోచేశారు. పోలీసులు ఆ పూజా రుల కోసం సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంతియాజ్ తెలిపారు.