పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం, ఇక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. ‘కొత్త వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించినట్లు చెప్పారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వె్‌స్టమెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పుడది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. ’పోలవరం ప్రాజెక్టులో ముందు డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలి. ఆ తర్వాత ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్ అంతా ఎత్తిపోస్తూ.. వాల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు సీజన్ల కంటే ముందే.. దీనిని కట్టేస్తే ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు వెంటనే చేపట్టవచ్చు. ప్రాజెక్టులో తొలిదశ, మలిదశ అనేవి లేవు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒక్కటే మా లక్ష్యం. చేపట్టాల్సిన పనుల్లో ముందు ఏవి పూర్తి చేయాలనేందుకే దశలుగా పేర్కొంటున్నాం. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.