కాకినాడ పరిధిలోని గండేపల్లి మండలం మురారి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ అనే మహిళకు రాజు, ఏసు, అఖిల్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కూలి పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కొద్ది రోజులపాటు డబ్బులు సంపాదించి తిరిగి స్వగ్రామానికి వస్తుంటారు. ఇదే క్రమంలో వీరంతా ఇవాళ(ఆదివారం) ఉదయం 4గంటల సమయంలో నర్సీపట్నం నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామ శివారు వద్ద రాగానే వర్షం కారణంగా బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి అందరూ రోడ్డుపై పడిపోయారు. అయితే అదే సమయంలో వెనక నుంచి వచ్చిన మరో వాహనం వారందరి పైనుంచి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు యువకులు రాజు, ఏసు, అఖిల్ అక్కడికక్కడే మృతిచెందారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై సీఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.