ప్రభుత్వం వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న ఇసుకను స్టాక్ పాయింట్ల నుంచి సక్రమంగా సరఫరా అయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ౖ మాట్లాడుతూ నిబంధలకు విరుద్థంగా ఇసుక సరఫరా, నిల్వ, ఎక్కువ ధరకు విక్రయించకుండా సంబంధిత శాఖల క్షేత్ర స్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేసులు నమోదు, పెనాల్టీలు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సరఫరాపై వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. తుళ్ళూరు మండలంలోని తాళ్లాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్డు వేయడానికి రూ. 13 లక్షలతో పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్ ద్వారా పనులు చేపట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తుళ్ళూరు మండలం బోరుపాలెం వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు సమావేశంలో కమిటీ ఆమోదించింది. అలాగే మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఇసుక తవ్వకాలకు గుర్తించిన కొల్లిపర మండలంలోని బొమ్మువానిపాలెం, పిడపర్తివారిపాలెం, వల్లభాపురం, అత్తలూరివారిపాలెం, దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు వద్ద వున్న రీచ్‌లను పది రోజులలోపు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నివేదిక అందించాలని సూచించారు. మున్నంగి, తాళ్లాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇంటర్నెట్, సీసీ టీవీల ఏర్పాటుకు విద్యుచ్ఛక్తి సరఫరా అవసరం అయి వున్నందున అధికారులు ఈ స్టాక్ పాయింట్ల వద్ద కరెంటు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే ఇసుక సరఫరా చేేస వాహనాలకు జిల్లా రవాణ శాఖ నిర్దేశించిన ధరలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధరల వివరాలను ప్రతి స్టాక్ యార్డులో ఫ్లెక్సీలు ప్రదర్శించాలని తెలిపారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నదని, టన్నుకు కేవలం రూ.250లు లోడింగ్ ఖర్చులను మాత్రమే వినియోగదారులు చెల్లింపు చేయాల్సిన అంశాన్ని ఫ్లెక్సీలో ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ భార్గవతేజ, ఆర్డీవో శ్రీకర్, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి చంద్రశేఖర్, జిల్లా ఉప రవాణ కమిషనర్ షేక్ కరీం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నారాయణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ డీడీ వందనం, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.