తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీఎస్ ఎల్వీ ఎల్వీ సుబ్రమణ్యం.. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాళాలు సేకరించడం మాత్రమే టీటీడీ బాధ్యత కాదన్న ఎల్వీ సుబ్రమణ్యం.. వచ్చిన విరాళాలను భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించాలని చెప్పారు. శ్రీవారి కైంకర్యాలలో ఎలాంటి లోటు లేకుండా చూడటంతో పాటుగా శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారానికి వేదిక కావాలని ఆకాంక్షించారు.
మరోవైపు టీటీడీ ఈవో ఎలా ఉండాలనే దానిపైనా మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో అంటే భక్త జన బృందానికి నాయకుడిలా ఉండాలని ఆయన సూచించారు. భక్తులను సైతం ధర్మమార్గంలో తీసుకువెళ్లేలా భాగస్వామిగా ఉండాలన్నారు. అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఇక స్వామి వారి ఉత్సవాల నిర్వహణపై దృష్టిపెట్టడంతో పాటుగా.. తిరుమల శ్రీవారి విశేషాలను తెలియజేసే పుస్తకాలు ముద్రించాలని ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. అలా ముద్రించిన పుస్తకాలను సరసమైన ధరలకి భక్తులకు అందజేయాలని కోరారు.
మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనం సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎల్వీ సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా మార్పులు జరుగుతాయనే ఆశాభావాన్ని ఎల్వీ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు.
మరోవైపు 1983వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఎల్వీ సుబ్రమణ్యం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎన్నికలు పూర్తయ్యాక అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజుల పాటు ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించింది. ఆ తర్వాత బదిలీ చేసింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వమే బదిలీ చేయడం అప్పట్లో సంచలనం రేపింది.