విజయవాడ పోలీసులు కొంతకాలంగా సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో యువతకు రూ.30వేలు గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించారు. టెక్నాలజీ సాయంతో సైబర్ కేటుగాళ్లు అమమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు.. సరికొత్త మార్గాల్లో అకౌంట్‌లలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటు మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసి, వారి భద్రతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ పోలీసులు సైబర్ నేరాలకు చెక్ పెట్టి.. అమ్మాయులు, మహిళ భద్రతకు సంబంధించి అందరిలో అవగాహన కల్పించేందుకు సరికొత్త ఆలోచన చేశారు.
విజయవాడ పోలీసులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా, మహిళలు, అమ్మాయిల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించే విధంగా వీడియోల కోసం పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వీడియో కంటెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విజయవాడ సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమీశాలి, టి.హరికృష్ణ, మురళీకృష్ణ నాయుడు, ఏసీపీ స్రవంతిరాయ్‌లు ఆవిష్కరించారు. ఇందుకోసం రెండు క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
యువత, యూట్యూబర్లు, విద్యార్థులు ఇలా ఎవరైనా పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసుకుని వాటి వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్ చేసుకుని.. వారు ఏ అంశంపై వీడియోను రూపొందిస్తారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలా రూపొందించిన వీడియోలను క్యూఆర్ కోడ్ చూపించిన లింక్‌ల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన వీడియోలను అధికారులు ఎంపిక చేసి.. ఇందులో మొదటి బహుమతిగా రూ.30వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
మరోవైపు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మరో సరికొత్త ఆలోచన చేశారు.. ఈ పహారా పేరుతో ప్రజల భద్రతకు సంబంధించి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో నేరాల నియంత్రణ కోసం గస్తీ విధానంలో సరికొత్త మార్పులు చేశార.. ఈ-పహారా పేరుతో కొత్త గస్తీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్లో సీపీ రాజశేఖరబాబు ప్రారంభించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారుల ప్రాంతాల్ని మ్యాపింగ్ చేసి నేరాలపై ఈ-నిఘా పెట్టారు పోలీసులు.. దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగే జరిగే ప్రదేశాలపైనా పోకస్ చేశారు. ఈ-పహారాను కానిస్టేబుళ్లు తమ మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేసుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారు. కానిస్టేబుల్స్ మొబైల్‌లోని జీపీఎస్ ఆధారంగా.. వారు ఏ సమయంలో ఏ పాయింట్‌కు వెళ్లారు అనేది కూడా తెలిసిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ-పహారాలో తాళం వేసిన ఇళ్లపైనా నిఘాను అనుసంధానం చేస్తామంటున్నారు విజయవాడ పోలీసులు.