తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి విజయమ్మను కలిశారా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అసలు విషయం ఏంటో చెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్ళిన జెసి ప్రభాకర్ రెడ్డి గారికి వెయిటింగ్ లాంజ్ నందు వై.ఎస్. విజయమ్మ గారు కనిపించడం తో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది. ఈ కలయిక లో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు' అంటూ ట్వీట్ చేశారు. జేసీ వర్గీయులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో విజయమ్మ కనిపించారని.. జేసీ ఆప్యాయంగా పలకరించారని.. అంతేకానీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఉందట.. అక్కడ వైఎస్ విజయమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అదే ఆస్పత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వైద్యం కోసం వెళ్లారట.. అక్కడ లాంజ్‌లో వేచి ఉన్న విజయమ్మను మర్యాదపూర్వకంగా పలకరించారని.. 'విజయమ్మ నేను ఫలానా' అని తనను తాను పరిచయం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ఫోటోలు తీస్తే వాటిపై ఇలా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఎంత శత్రువులైనా సరే ఎదురుపడితే మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం సర్వ సాధారణమే అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం మంచిది కాదంటున్నారు. మొత్తానికి జేసీ, విజయమ్మల భేటీ వ్యవహారంపై ఇలా క్లారిటీ వచ్చేసింది.