తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్నిప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు.. అగ్నిప్రమాదం కేసులో నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో సమన్వయం కోసం సీఐడీ దర్యాప్తు ఇవ్వడం మేలని ప్రభుత్వం భావించింది. మరీ ముఖ్యంగా.. ఈ కేసులో భూ సంబంధిత బాధితులందరికీ న్యాయం చేయాలని.. ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.