రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.