ఇసుక పంపిణీ విధానంలో ఎటువంటి లోటుపాట్లుకు తావులేకుండా.. ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. రాజమహేంద్రవరం పరిధిలోని నిడదవోలు మండలం పెండ్యాల ఇసుక ర్యాంపు, పెరవలి మండలం ఉసులుమర్రు స్టాక్ పాయింట్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించా లన్నారు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండి సమయపాలన పాటించాలన్నారు.లోకల్, నాన్‌లోకల్ అన్న పరిస్థితులు లేకుం డా ఇసుక కోసం వినియోగదారుడు చేస్తున్న అభ్యర్థనే ప్రామాణికంగా ఇసుక పంపిణీ విధానం అమలు చేయాలన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లా డుతూ జిల్లా ఇసుక రీచ్‌లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక అమ్మకాలను నిర్వహిస్తున్నామన్నారు. రీచ్‌లలో ఇసుక లభ్యతను బట్టి లైన్లో ఉండే వాహనాలకు టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. సాయంత్రం 6 తరువాత ఎటువంటి లోడింగ్ జరగకుండా క్షేత్రస్తాయి సిబ్బంది, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.ఇసుక ఎగుమతి చేసుకోవడానికి వచ్చిన లారీ డ్రైవర్లు, ప్రజలను ఉసులుమర్రు స్టాక్‌పాయింట్ వద్ద సమస్యలు అడి గి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ జి.నరసింహులు,మైన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.