పశ్చిమగోదావరి జిల్లాలోని డ్రెయిన్లలో రూ.ఐదు కోట్ల 92 లక్షలతో చేపట్టిన 35 తూడు తొలగింపు పనులను విమర్శలకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె డ్రెయినేజ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ‘నీటిపారుదల సాఫీగా సాగేలా డ్రెయిన్లలో తూడు తొలగింపు పనులు చేపట్టాలి. ఏ ప్రాంతంలో ఏ రోజు తూడు తొలగింపు పనులు చేపడుతున్నది ముందుగానే సంబంధిత ప్రాంత ప్రజా ప్రతినిధులకు, రైతులకు సమాచారం అందించాలి. 64 పూడికతీత పనులకు మూడు కోట్ల రెండు లక్షలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం’ అని తెలిపారు. ‘గునుపూడి సౌత్ డ్రెయిన్ కారణంగా తాడేరు చుట్టుపక్కల ప్రాంతంలోని రెండు వందల ఎకరాల మేర నీరు చేరుతోందని, పొలిమేరతిప్ప మీడియం డ్రెయిన్ కారణంగా బ్యాక్ వాటర్ వల్ల 500 ఎకరాల్లో నీరు చేరుతుంది. ఉప్పుటేరు–చిన్న కాపవరం వద్ద ఉప్పుటేరు మొదట్లో నీటి ప్రవాహానికి కిక్కిస అడ్డు తగులుతోందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ వివరించారు. ఆకివీడు దుంపగడప వద్ద రైల్వేలైన్ కింద నిర్మించిన కల్వర్టులో పైపులు, మట్టి దిబ్బ తొలగించకపోవడంతో తూడు, తుక్కు అడ్డుపడి నీటి ప్రవాహానికి ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. దీనిపై రైల్వే అధికారులతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. గునుపూడి సౌత్ డ్రెయిన్, పొలిమేర తిప్ప మీడియం డ్రెయిన్, ఉప్పుటేరు కిక్కిస తొలగింపు పనులకు ప్రతిపాదనలను సమర్పిస్తే నిధులను కేటాస్తామన్నారు. ఈఈ డ్రెయిన్స్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీఈలు జి.వినోద్ చంద్ర, కె.వరప్రసాద్, ఏఈఈలు పి.వెంకటేశ్వరరావు, ఖాదర్ వలీ పాల్గొన్నారు.