శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే... పలాసకు చెందిన డోకి నిరంజన్ (20), విశాఖకు చెందిన జె.యశ్వంత్, బి.ఆశిష్, హైదరాబాద్‌కు చెందిన రెహన్, తాడేపల్లిగూడేనికి చెందిన లలిత్ విశాఖలోని గీతం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. స్నేహితుల దినోత్సవం కావడంతో సరదాగా గడిపేందుకు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గంభీరం రిజర్వాయర్‌కు చేరుకున్నారు. సరదాగా గడుపుతుండగా డోకి నిరంజన్ సెల్ఫీ తీయడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కాలుజారి రిజర్వాయర్‌లో పడిపోయాడు. అతడిని రక్షించేంందుకు జె.యశ్వంత్, బి.ఆశిష్ నీటిలో దూకారు. అయితే ముగ్గురికీ సరిగా ఈత రాకపోవడంతో నీట మునిగిపోతుండగా, స్థానికులు గమనించి రిజర్వాయర్‌లోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే యశ్వంత్, ఆశిష్‌లను సురక్షితంగా బయటకు తీసినా, నిరంజన్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బలగాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ఆస్పత్రికి తరలించి సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.