ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ సమావేశం జరుగుతోంది. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి సమావేశం జరుగుతున్న మందిరానికి వచ్చారు. చంద్రబాబు వచ్చి తనకు కేటాయించిన సీట్‌లో కూర్చునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఛైర్‌కు తెల్ల టవల్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.. దాన్ని చూసిన వెంటనే చంద్రబాబు వద్దని వారించారు. వెంటనే ఆ టవల్ తొలగించాలని భద్రతా సిబ్బందికి సైగలు చేశారు. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఈ టవల్‌ను ఛైర్ నుంచి తొలగించారు.. అప్పుడు కానీ ఆయన ఆ కుర్చీలో కూర్చోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే ఈ సీన్ కనిపించింది.. ఆయన కూడా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని.. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. వీలైనంత తక్కువ సమయం మాత్రమే ట్రాఫిక్ ఆపాలని సూచించారు.
తన పర్యటన సమయంలో పరదాలు వంటివి ఏర్పాటు చేయొద్దని సూచించారు.. తిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ పరదాలను తొలగించే వరకు ఊరుకోలేదు. అంతేకాదు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది భారీకేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని కూడా తొలగించాలని సూచించారు. ప్రజలకు, తనకు మధ్య గ్యాప్ తీసుకురావొద్దని అధికారులకు సూచించారు. అంతేకాదు రాజకీయాల్లో కాళ్లకు మొక్కే సంప్రదాయాలను కూడా పక్కన పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకవేళ ఎవరైనా పార్టీ నేత, కార్యకర్త తన కాళ్లకు మొక్కితే తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కాల్సి వస్తుందని సున్నితంగా చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి పద్దతులు సరికాదన్నారు.
అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి తన సింప్లిసిటీని చూపిస్తున్నారు. ఆయన హాజరవుతున్న సమావేశాల్లో తనుక ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు అవసరంలేదని.. ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసినా తిరస్కరించి.. అందరు ఏ కుర్చీలో కూర్చున్నారో ఆయన కూడా అదే కుర్చీలో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. ఇకపై మారిన చంద్రబాబు చూస్తున్నారని మీడియాతో చిట్‌చిట్‌గా అన్నారు. చెప్పినట్లుగానే దటీజ్ చంద్రబాబు అనిపించుకుంటున్నారు.
మరోవైపు కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా శాఖల వారీగా వంద రోజుల్లో సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యం నిర్దేశిస్తారు. వర్గాల వారీగా చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమగ్ర ప్రణాళికలపై సీఎం ఈ అంశాలపై దిశా నిర్దేశం చేస్తారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాలని.. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోందన్నారు చంద్రబాబు. గత ఐదేళ్ల పాలన బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా సాగిందని.. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదన్నారు. ఈ ఐదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారన్నారు.
ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలు మారతాయరని..మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. అందరం కలిసి కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్‌గా ఉంటామని వ్యాఖ్యనించారు. ప్రజావేదికలో ఆనాటి ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారని.. కొందరు అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేశారన్నారు.
గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అవమానాలు చేసినా వ్యవస్థల్ని తిరిగి బతికించాలనే ఉద్దేశంతో తట్టుకుని నిలబడ్డామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం బలమైన వ్యవస్థల్ని ఆటబొమ్మలుగా మార్చిందని.. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ద్వారా తెలిసిందన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.