విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గమ్మ ఆలయంలో.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని (ఆర్జిత, ఉచిత) నిర్వహిస్తున్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 5 నుంచి సెప్టెంబరు 2 వరకు పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 16న దుర్గమ్మను వరలక్ష్మీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారన్న విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. విజయవాడ ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 17 (శనివారం)న సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని ఈవో రామారావు చెప్పారు. 18 (ఆదివారం)న వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం అనంతరం మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు పవిత్ర ధారణ చేస్తారని భక్తులు గమనించాలన్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. ఈ నెల 19 (సోమవారం)న మూలమంత్ర హవనాలు, వేద పారాయణ నిర్వహిస్తారన్నారు. 20 (మంగళవారం)న ఉదయం 8 నుంచి 10గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత్త శాంతిపౌష్టిక హోమాలను నిర్వహిస్తారని ఈవో అన్నారు. అదే రోజు ఉదయం 10.30గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయన్నారు.
విజయవాడ ఇంద్రకీల్రాదిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులు దరఖాస్తులు ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ఈనెల 17 నుంచి 21 వరకు పూర్తి చేసిన దరఖాస్తులను ఆలయలో అందజేయాలని భక్తులకు సూచించారు. ఒకవేళ ఆలయంలో ఆర్జిత వరలక్ష్మీ వ్రతం కావాలంటే.. ఒక్కో టికెట్ రూ.1500గా నిర్ణయించినట్లు తెలియజేశఆరు. ఈ నెల 23న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దుర్గమ్మ భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.