బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలు, ప్రధాని పరారీ, సైన్యం చేతుల్లోకి పాలన వెళ్లిపోయి నేపథ్యంలో.. భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే భారత్ - బంగ్లాదేశ్ బోర్డర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలోనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ - బీఎస్ఎఫ్.. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. భారీగా సైన్యాన్ని సరిహద్దుల వద్ద మోహరించి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధించినా లెక్క చేయని.. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నివాసాన్ని కూడా ఆందోళనకారులు చుట్టుముట్టడంతో చేసేదేమీ లేక.. షేక్ హసీనా పరారయ్యారు.
భారత్‌కు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దారుణంగా పడిపోవడంతో సరిహద్దుల్లో భారత సైన్యం అలర్ట్ అయింది. కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు మరింత భద్రతను పెంచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతోపాటు సైన్యం కంట్రోల్‌లోకి తీసుకోవడంతో.. భారత్ అలర్ట్ అయింది. ఇక షేక్ హసీనా.. ఢాకా నుంచి పశ్చిమ బెంగాల్‌కు ఆర్మీ హెలికాప్టర్‌లో వెళ్లినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు.. ఆమె త్రిపుర రాజధాని అగర్తల చేరుకున్నట్లు మరిన్ని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఢాకా నుంచి అగర్తలకు మధ్య చాలా తక్కువ దూరం ఉంటుంది. ఢాకా నుంచి అగర్తలకు రోడ్డు మార్గం అయితే 130 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని.. ఇక హెలికాఫ్టర్ అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే చేరుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్ వదిలి అగర్తలకు చేరుకున్న షేక్ హసీనా.. త్వరలోనే అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బంగ్లాదేశ్ ఆందోళనల దృష్ట్యా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే ఆర్మీ రూల్ విధించినట్లు పేర్కొన్నారు. అయితే త్వరలోనే బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతామని.. ప్రజలు సంయమనం పాటించాలని వాకర్-ఉజ్-జమాన్ సూచించారు.