ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ చట్టంలో 40 సవరణలు ప్రతిపాదించిన కేంద్రం,,, పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 11:33 PM

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు సిద్దమైన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డుల విస్తృత అధికారాల్లో కోత విధించే దిశగా చర్యలు ఉపక్రమించింది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది. అలాగే వక్ఫ్‌ బోర్డుల్లో మహిళలకూ తప్పనిసరి ప్రాధాన్యత కల్పిస్తూ వక్ఫ్‌ చట్టంలోని 9,14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని మోదీ సర్కారు నిర్ణయానికి వచ్చింది.


  వక్ఫ్‌ ఆస్తుల దుర్వినియోగానికి అరికట్టేందుకు వాటిపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సవరణ బిల్లులో పేర్కొంది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు 2022 సెప్టెంబరులో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తంపై తనకే హక్కు ఉందని తమిళనాడు వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖరస్వామి ఆలయం, దాని భూములు కూడా తనవేనంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.


ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు.. వక్ఫ్‌ బోర్డు నుంచి అనుమతి తీసుకురావాలని జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తచేసిన గ్రామస్థులు.. విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించడంతో రెవెన్యూ అధికారి ప్రాథమిక విచారణ జరిపి, అనంతరం క్రయవిక్రయాలను ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు.


ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేలా కేంద్రం చట్ట సవరణకు ఉపక్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, వక్ఫ్ బోర్డుల్లో తమకు భాగస్వామ్యం కల్పించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం నిర్ణయంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా స్పందించింది. వక్ఫ్ చట్టంలో ఎటువంటి మార్పులను అంగీకరించబోమని ప్రకటన చేసింది. ‘వక్ఫ్ చట్టం 2013లో దాదాపు 40 సవరణల ద్వారా ఆస్తుల స్థితి, స్వభావాన్ని మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోంది.. కాబట్టి వాటి స్వాధీనం సులభతరం అవుతుంది.. వక్ఫ్ ఆస్తులు మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన ముస్లిం దాతల విరాళాలు’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పష్టం చేయడం ముఖ్యం.. వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని మాత్రమే రూపొందించింది’ అని లా బోర్డు అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్‌క్యూఆర్ ఇలియాస్ అన్నారు.


ఇది కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం కాదని, తరువాత సిక్కులు, క్రైస్తవుల ఆస్తుల కావచ్చునని భయపడుతున్నారని అన్నారు. ఇక, దేశంలో మొదటిసారిగా వక్ఫ్ చట్టాన్ని 1954లో తీసుకొచ్చారు. అనంతరం 1995లో దానికి తొలిసారి సవరణలు చేయగా.. 2013లో మరోసారి సవరించారు. అయితే, ఒకసారి వక్ఫ్ బోర్డులోకి ఏదైనా ఆస్తి వెళ్తే వాటిని వెనక్కి తీసుకోవడం కుదరదని, అందుకే శక్తివంతమైన ముస్లింలు వక్ఫ్ బోర్డును స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మహిళలు, పిల్లలు బాధపడుతున్నారు. ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె, ఆమె పిల్లలకు ఆస్తులపై ఎటువంటి హక్కులు లభించవు అని వర్గాలు చెప్పాయి.


త్వరలో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. జమ్మూ కశ్మీరులో కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com