దానిమ్మ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి సీజన్లతో సంబంధం లేకుండా మనకు ఏడాది పొడవునా లభిస్తాయి. దానిమ్మ పండ్లు చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. అయితే వాస్తవానికి ఈ పండ్లను రోజూ తినాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఈ పండ్లను తినడం ఇబ్బందిగా ఉంటుంది అనుకునేవారు దానిమ్మ పండ్లకు చెందిన జ్యూస్‌ను తాగవచ్చు. రోజూ ఈ జ్యూస్‌ను ఒక్క గ్లాస్ మేర తాగినా చాలు, ఎన్నో లాభాలను పొందవచ్చని అంటున్నారు.
మలబద్దకం సమస్య తీవ్రంగా ఉన్నవారు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడి ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని తాగితే ఎంతో ఫలితం ఉంటుంది.
దానిమ్మ పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే వ్యాధి నుంచి బయట పడవచ్చు. రోజూ ఈ పండ్ల జ్యూస్‌ను తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే శరీరంలో వేడి ఉంటుంది. దీని వల్ల వారి చర్మం కూడా పొడిబారిపోతుంది. తలనొప్పి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఉదయం దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగాలి. దీంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరంలోని వేడి బయటకు పోతుంది. శరీరం చల్లగా మారుతుంది. దీంతో చర్మానికి తేమ లభిస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది.