సైబర్ నేరాల కట్టడికి కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఐపీఎస్‌ల నుంచి ఎవరైనా మాట్లాడతారా.. అని సీఎం అడిగారు. పక్కనే ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. రాజశేఖరబాబు పేరు చెప్పారు. చంద్రబాబు చొరవతో మాట్లాడిన రాజశేఖరబాబు.. సైబర్ నేరాల్లో అమాయకులు ఎక్కువగా డబ్బు కోల్పోతున్నారన్నారు. కమిషనరేట్ పరిధిలో రోజుకు ఐదారు ఫిర్యాదులు సైబర్ పీఎస్‌కు అందుతున్నాయన్నారు. ‘అనుభవం ద్వారా అవగాహన’ అనే కార్యక్రమం ద్వారా 16 రకాల సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందించామ న్నారు. ముందుగా పోలీసు శాఖలో టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న 200 మందిని సైబర్ కమాండోలుగా నియమించామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి విద్యార్థులు, యువత నుంచి సైబర్ సోల్జర్స్‌ను, వారి నుంచి సైబర్ సిటిజన్స్‌ను తయారు చేస్తామని చెప్పారు. మూడు నెలల్లో 2లక్షల మంది సైబర్ సిటిజన్స్ తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను టెక్నాలజీ సాయంతో పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ట్రాఫిక్‌పై అర్కాడిస్ అనే సంస్థతో సంపూర్ణ అధ్యయనం చేయిస్తున్నామన్నారు.