పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి రాంప్రసాదరెడ్డి సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి బాధితులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. సోమవారం సాయంత్రం పుంగనూరు జీడ్పీ అతిధిగృహంలో టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డితో కలసి ప్రజా దర్బార్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో వ్యవస్థల్లో జరిగిన లోపాలను సరిదిద్ది రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పూర్వం నుంచి ఉన్న ఆస్తులను ఇతరులకు మార్చడం, ఆన్‌లైన్‌లో మార్పులు, రికార్డుల తారుమారు తదితర అవకతవకలపై రెవెన్యూ అధికారులు దృష్టిపెట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 23 క్వారీలకు అనుమతులిస్తే ఏడు పని చేస్తున్నాయని వివరించారు. ఎక్సైజ్ పాలసీని సవరించేందుకు నాలుగు కమిటీలను వేసి ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి అయిషాబేగం వివరించారు. నేతిగుంటపల్లె, ఆవులపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గ్రీన్‌ట్రైబ్యునల్ ఆదేశాలతో గత ఏడాది నుంచి పనులు నిలినివేసినట్లు ఇరిగేషన్ ఎస్‌ఈ తెలిపారు. పుంగనూరులో పెద్దిరెడ్డి నిర్మించిన ప్రాజెక్టుల్లో ఒక్కదానికైనా రైతులకు పరిహారం అందజేయలేదని టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా వందలాది మంది భారీ ఎత్తున మంత్రికి వినతులు అందజేశారు. ఇతర జిల్లాలకు బదిలీ చేయొద్దంటూ హోంగార్డులు వినతిపత్రం ఇచ్చారు. పలమనేరు సబ్‌కలెక్టర్ మనోజ్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, టీడీపీ మాజీ ఇన్‌చార్జి వెంకటరమణరాజు, నాయకులు శ్రీకాంత్, మాధవరెడ్డి, సుబ్రహ్మణ్యంరాజు, దినేశ్, ఆర్వీటీ బాబు, గువ్వల రమేశ్‌రెడ్డి, సీవీరెడ్డి, పోలీ్‌సగిరి, రామయ్య, వెంకటమునియాదవ్, సుకుమార్, కేబీడీ సుగర్స్ ప్రెసిడెంట్ ఇంద్రప్రకాశ్, ప్రకాశ్, ఇబ్రహీం, శ్రీనివాసులురెడ్డి, పోలీ, చంద్ర, ప్రసాద్, జనసేన నేతలు పడగాల రమణ, విరూపాక్షి, హరినాయక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.