జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి బుధవారం ఎన్నిక జరగనున్నది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కౌన్సిల్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించు సమానబలం ఉండడంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. స్టాండింగ్ కమిటీలో పది స్థానాలు ఉండగా కూటమి నుంచి పది మంది, వైసీపీ నుంచి పది మంది పోటీలో నిలిచారు. వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు ఇటీవల టీడీపీ, జనసేనల్లో చేరారు. దీంతో కూటమి బలం ప్రస్తుతం 47కి పెరిగింది. అదే సమయంలో వైసీపీ బలం 48కి తగ్గింది. సీపీఐ, సీపీఎం కార్పొరేటర్ల వైఖరి ఇంకా తేలాల్సి ఉంది. కాగా కౌన్సిల్‌లో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండడంతో స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఎవరైనా విజయం సాధించాలంటే కనీసం 49 ఓట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. అంటే వైసీపీకి ఒకరు, కూటమికి ఇద్దరు అదనంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే వైసీపీ నుంచి మరో ఆరుగురు కార్పొరేటర్లు మంగళవారం టీడీపీ, జనసేన పార్టీల్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అది వాస్తవమైతే కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ భయం కూడా వెంటాడుతోంది. కొత్తగా ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరుతున్నందున తమ బలం 53కి పెరుగుతుందని, తమలో ఒకరిద్దరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినా ఇబ్బంది ఉండదని కూటమి నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు కనీసం ఐదు స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. తమ పార్టీ నుంచి టీడీపీ, జనసేనలో చేరినవారి కారణంగా ఆయా పార్టీల్లోని కార్పొరేటర్లు కొందరు అసంతృప్తితో ఉన్నారని, వారంతా తమ అభ్యర్థుల్లో కొందరికి మద్దతుగా ఓటేస్తారని చెప్పుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీలో కనీసం ఐదు స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఉదయం పార్టీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నట్టు సమాచారం. సమావేశం ముగిసిన వెంటనే కార్పొరేటర్లను రహస్య ప్రాంతానికి తరలించి, బుధవారం ఉదయం అక్కడ నుంచి ఓటేసేందుకు నేరుగా జీవీఎంసీ కార్యాలయానికి తీసుకురావాలనే వ్యూహంలో వైసీపీ నేతలు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, నేతలు స్టాండింగ్ కమిటీలో పదికి పది స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరాలనే ఆసక్తితో ఉన్నవారిలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సోమవారం జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుతో చర్చించినట్టు తెలిసింది. కూటమికి చెందిన కార్పొరేటర్లను కూడా క్యాంపునకు తరలించే ప్రతిపాదన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా కూటమి, వైసీపీకి సమానబలం ఉండడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.