ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. వైసీపీ నేతలపై ఇష్టానుసారం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడులు చేసి ఏం సాధిస్తున్నారన్న వైఎస్ జగన్.. ఇలాంటి వాటితో ఎవరూ భయపడరని అన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న వైఎస్ జగన్.. చంద్రబాబు గ్రాఫ్ వేగంగా పడిపోతోందని అన్నారు. పాలనపై ఫోకస్ చేయకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు మంచివి కాదన్న వైఎస్ జగన్.. వీటిపై చంద్రబాబు ఓసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులు చెడు సంప్రదాయమన్న వైఎస్ జగన్.. ఇవి ఇలాగే కొనసాగితే చాలా నష్టపోతారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ వాళ్లను ఆపడం తన తరం కూడా కాదంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.