అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు.. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఇక ఇదే మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి వివరించారు. కొత్త మద్యం పాలసీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ.. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను తొలగించడం, స్థానిక సంస్థల్లో పోటీ చేసేవారికి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం, మత్స్యకారులకు సంబంధించిన జీవోను రద్దు చేయడం సహా పలు కీలక అంశాలను కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో అక్టోబర్ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని గుర్తించారు. దీంతో ఈసారి ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
ఇక ఇప్పటికే నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త ఎక్స్రైజ్ పాలసీని అమలు చేసేందుకు దృష్టి సారించింది. ఇక ఇప్పటికే ఈ కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఈ నూతన మద్యం విధానాన్ని తయారు చేసేందుకు.. ఏపీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అమలు అవుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేసేందుకు 4 బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండగా.. వారు తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి మద్యం పాలసీని అధ్యయనం చేస్తున్నాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి.. ఈ నెల 12లోగా ఈ బృందాలు తమ నివేదికలను ఏపీ ప్రభుత్వానికి అందించనున్నాయి. వీటిని పరిశీలించి కొత్త మద్యం పాలసీపై సర్కార్ ఓ నిర్ణయానికి రానుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీ తేదీ నుంచి.. ఆ కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.
ఇక ఈ మంత్రివర్గ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 22ఏ సెక్షన్ కింద ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లను.. 3 నెలల పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు. క్యూఆర్ కోడ్‌తో ఉన్న పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను తొలగించాలని పలువురు మంత్రులు సూచించారని.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని.. అది ఏపీలో ఉందని దానిపై చర్చించి సంతానోత్పత్తి రేటును ఎలా పెంచాలి అనేదానిపై చర్చ జరిగిందని పేర్కొన్నారు.
ఇక నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. ఫేజ్- 2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి 100 సీట్లతో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కోర్సు ప్రారంభించడానికి చేసిన ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది.
జీవో నంబర్ 40 రద్దుకు జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించింది. గతేడాది మే 11 వ తేదీన జారీ చేసిన జీవో 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేసి తిరిగి నీటిపారుదల శాఖకు కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.