మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయంపై ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, అందుకే ఎవరితో, ఏ దర్యాప్తు జరిపినా తనకేం ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకండా గడిపానని, ఆస్తుల వివరాలన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించామని ఆయన వెల్లడించారు.చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, జిల్లాలో ఆయనను ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నందువల్లనే, ఇలా టార్గెట్ చేసి, కుట్రలతో తానెలాంటి తప్పు చేయకపోయినా, దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్షేపించారు. అదే పనిగా తన వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అస్సాసినేషన్) చేస్తున్నారని, వాస్తవాలతో సంబంధం లేకుండా, తమ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దానికి వత్తాసుగా సీఎం మొదలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన దోషిత్వంపై ఏ ఆధారాలు లేకపోయినా, అదే పనిగా బురద చల్లుతున్నారని చెప్పారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగి, రికార్డులు తగలబడ్డాయని చెబుతున్నారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిజానికి అవన్నీ ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్‌తో పాటు, చివరకు సచివాలయంలో కూడా ఉంటాయని గుర్తు చేశారు. మరోవైపు మదనపల్లెలో డేటా రిట్రీవ్ చేశామని అధికారులు చెబుతున్నారన్న ఆయన, అలాంటప్పుడు ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని.. అది కూడా మేమే చేశామని ఎలా అంటున్నారని నిలదీశారు. ‘మీ పార్టీ కార్యకర్తలు, నాయకులను అడ్డం పెట్టుకుని, వారితో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. అలా మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే, వాటని నిరూపించండి. అంతే కానీ, తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో దిగకండి’.. అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నారన్న ఆయన, తామే తప్పు చేయనందువల్ల, ఎవరు దర్యాప్తు చేసినా తమకెలాంటి భయం లేదన్నారు. వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను 7సార్లు ఎమ్మెల్యేగా గెల్చానని, తన కుమారుడు మూడుసార్లు ఎంపీ కాగా, తన తమ్ముడు కూడా 3సార్లు ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ప్రజాదరణ ఉంది కాబట్టే, ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలిపారు.