జగన్ను ప్రజలు మాత్రమే కాదు..ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్కు హామీల అమలులో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారన్నారు. పొలోమని పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లోనే కాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా జగన్కు తత్వం బోధపడడం లేదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. జగన్ రెడ్డి తాను మళ్లీ సీఎం కుర్చీపైన కూర్చుంటానంటూ పగటి కలలు కంటున్నారన్నారు.