జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని.. ప్రతిపక్ష నేత కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా.. తాము గౌరవిస్తున్నామన్నారు. అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారన్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కొంత మందిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అనలేదా? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. నైతిక విలువ కోసం మాట్లాడే అర్హత జగన్‌కి లేదన్నారు. జగన్‌కి చంద్రబాబు ఫోబియా పట్టుకుందని సొంత చెల్లెలే అన్నారని గంటా తెలిపారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెల్లెలే చెబుతోందన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేసి అభాసుపాలు అయ్యారన్నారు. త్వరలోనే విశాఖకు మెట్రో రాబోతోందని... అలాగే ఫ్లై ఓవర్లు కూడా రానున్నాయని గంటా పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులను వేగవంతం చేశామని.. నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ నేతలు నాశనం చేశారని గంటా విమర్శించారు. మాస్టర్ ప్లాన్ కూడా మార్చేశారన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్ రానుందన్నారు. విశాఖ భూ కుంభకోణాలు బయట పెడతామని.. వైజాగ్ ఫైల్స్‌పై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారన్నారు. టీడీఆర్ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని గంటా వెల్లడించారు. ఋషికొండ భవనాలను ఏమీ చేయాలో తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది గెలుచుకున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇదే నాంది అని పేర్కొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని తెలిపారు. వైసీపీ మునుగుతున్న నావ అని.. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయిందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.