నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. జిల్లాలో నంద్యాల ఎంపీగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు. అయితే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి నంద్యాల టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అనుచురుడు గిత్త జయసూర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి.. గెలిచారు. అప్పటినుంచి ఇక్కడ గ్రూప్ వార్ మొదలైంది. ఎంపీ శబరి తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే గిత్త జయసూర్యగా ఇక్కడి రాజకీయం మారింది. నియోజకవర్గంలో తన మాట గెలవాలని శివానందరెడ్డి, జయసూర్య పట్టుబడుతుంటే.. తమ మాట గెలవాలని రాజశేఖర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో నందికొట్కూరు రాజకీయం రసవత్తరంగా మారింది. చేరికల విషయంలోనూ ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. తాజాగా నందికొట్కూరుకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఇటీవల బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే తాజాగా వీరిలో నలుగురు కౌన్సిలర్లు జయసూర్య గూటికి చేరడంతో ఇక్కడ గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుకుందన్న చర్చ జరుగుతోంది.