వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల మీద ఆయన ఫొటోలు వేసుకుంది. ఈ పాసుపుస్తకాల స్థానంలో ప్రభుత్వ రాజముద్ర కలిగిన పుస్తకాలను ఇస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త నమూనా పాసుపుస్తకాన్ని విడుదల చేశారు. తాజాగా బుధవారం జరిగిన కేబినేట్ మీటింగులో రాజముద్రతో కొత్త పాసుపుస్తకాల పంపిణీకి ఆమోదం లభించింది. మూడు విడతల్లో 329 గ్రామాల్లో రీసర్వే జరగ్గా.. 90,287 మంది రైతులకు జగన్ ఫొటోతో పాసుపుస్తకాలను అందించారు. త్వరలో వాటన్నింటినీ రద్దు చేసి రాజముద్రతో కొత్తవి అందించనున్నారు. అలాగే జగన్ పేరు, ఫొటోతో ఉండే సర్వే రాళ్లను కూడా తొలగించేందుకు కేబినేట్ ఆమోదించింది. ‘మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో మంటలు’ కారణంగా మూడు నెలల పాటు 22ఏ జాబితా నుంచి తొలగించిన భూముల రిజిస్ర్టేషన్లను ఆపేసింది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా.. అక్టోబరు ఒకటి నుంచి నూతన పాలసీ ప్రవేశపెడుతున్నట్లు కేబినేట్‌లో తెలిపారు. వైసీపీ హయాంలో అందించిన నాసిరకం కాకుండా నాణ్యత కలిగిన మద్యాన్ని అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నూతన మద్యం విధానం ఎలా ఉంటుందోనని ఆ రంగ వ్యాపారుల్లో ఉత్సకత నెలకొంది.