చిత్తూరు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు)లనూ విభజించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చిత్తూరు డీసీసీబీని విభజించి తిరుపతి కేంద్రంగా మరొకటి ఏర్పాటు కానుంది. కొన్ని సింగిల్ విండోలు, శాఖలు అన్నమయ్య జిల్లాలో కలవనున్నాయి. అమరావతిలో ఇటీవల జరిగిన డీసీసీబీ సీఈవోల సమావేశంలో ఉన్నతాధికారులు ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ప్రధాన కార్యాలయంతో కలిపి 20 శాఖలు, 75 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2940 కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో చిత్తూరు డీసీసీబీ ఏడో స్థానంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినా డీసీసీబీ మాత్రం ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతోంది. దీనినీ విభజించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ శాఖలను, సింగిల్ విండోలను కూడా జిల్లాలవారీగా విభజించనున్నారు. ఈ ఏడాది ఆఖరిలోగా విభజన ప్రక్రియను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వాస్తవానికి ఇదివరకే డీసీసీబీ పాలకవర్గాల పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలం ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా డీసీసీబీకి పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ శ్రీనివాసులును నియమించారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈయన డిసెంబరు వరకు కొనసాగనున్నారు. ఆలోగా బ్యాంకు విభజన ప్రక్రియ పూర్తిచేసి సింగిల్ విండోలకు, డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించాలా? లేక నామినేటెడ్ పద్ధతుల్లో త్రిసభ్య లేదా ఏడుగురు సభ్యులతో కూడిన పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను నియమించాలా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.