అభివృద్ధి మోడల్‌గా కుప్పాన్ని తీర్చిదిద్దే పని మొదలైంది. ఇందుకు అనుగుణమైన విజన్ డాక్యుమెంట్ రూపల్పనలో కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (కడా) నిమగ్నమైంది. ఈనెల 12లోగా దీనిని పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కడా పీడీ ప్రజెంటేషన్ చేయనున్నారు. గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో కుప్పం అభివృద్ధి పదేళ్ల వెనక్కు వెళ్లిపోయిందన్న భావన నియోజకవర్గ ప్రజలలో బలంగా ఏర్పడింది. అందుకే ఈ పదేళ్ల వెనుకబాటుతనాన్ని కవర్ చేసుకుంటూ, వచ్చే పదేళ్లను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని సాకారం చేయడానికి సీఎం సంకల్పించారు. సమర్థుడైన యువ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌కు కడా సారథ్య బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, ఇంకా ప్రభుత్వంలోని ప్రతి విభాగమూ ప్రస్తుతం కుప్పం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములవుతున్నాయి. రెండు రోజులుగా రోజుకు రెండుమూడు ప్రభుత్వ శాఖాధికారులు, నైపుణ్యం కలిగిన ప్రైవేటు ఏజెన్సీలతో కలిసి కడా కార్యాలయంలో సమావేశమై సమీక్షలు జరుపుతున్నారు. బుధవారం ఆర్‌అండ్‌బీ, ఏపీఐఐసీ తదితర ప్రభుత్వ విభాగాల సమావేశం జరిగింది. విజన్ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత స్థానికులైన మేధావులు, రాజకీయ ప్రతినిధులతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకుంటారు. అనంతరం ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో విజన్ డాక్యుమెంట్‌పై కడా పీడీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం మార్పుచేర్పులుంటాయి. రాబోయే మూడేళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని నమూనా నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. తర్వాత రాష్ట్రం మొత్తం కుప్పం మోడల్‌గా అభివృద్ధి చేపడతారు.