రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన పార్వతి(33)పై ప్రియుడు మోహన ఇటీవల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో మోహనతో పాటు అతడి తమ్ముడు సిద్ధేశ్వర్ను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పార్వతి, మోహన ఆర్థిక, కుటుంబ సమస్యలతో గత మూడురోజుల క్రితం తీవ్రంగా గొడవపడ్డారు. ఈ క్రమంలో మోహనతో పాటు సిద్ధేశ్వర్ పార్వతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెతో పోలీసులు వాంగ్మూలం తీసుకుని ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బుధవారం ఆమె మృతి చెందింది. ఈ కేసు లో మోహనను, సిద్ధేశ్వర్ను గురువారం అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ పేర్కొన్నారు.