ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన ‘ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ సంస్కృతి, సమిష్టి జీవన విధానానికి ప్రాథమిక సాక్ష్యం ఆదివాసీలు.. పరస్పర సహకారం, నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు అని కొనియాడారు. సహజ వాతావరణంలో స్వచ్ఛమైన జీవన విధానంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో మంత్రి గుండు సుధారాణి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి, పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు.